ప్రధాని నిజాయితీ... ప్రశంసించకుండా ఉండలేరు

updated: February 22, 2018 16:15 IST
ప్రధాని నిజాయితీ... ప్రశంసించకుండా ఉండలేరు

నీరవ్‌మోదీ- పీఎన్‌బీ కుంభకోణం నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. నాటి రాజీకీయ నేతల చిత్తశుద్ధికి, నేటి పాలకుల సాచివేత ధోరణికి అద్దంపట్టే అంశం కావటంతో అందరూ ఈ అంశాన్ని హైలెట్ చేస్తూ,కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఏమిటా విషయం అంటే.. ప్రధాని పదవిలో ఉండికూడా కారు కొనుక్కోవడానికి డబ్బుల్లేక.. లాల్‌బహదూర్‌ శాస్త్రి బ్యాంకులో రుణం తీసుకోగా, ఆఖరి నయాపైసాతో సహా ఆ కుటుంబం తిరిగి చెల్లించడం గురించిన విషయం ఇది

 

కారు కొనుక్కునేందుకు నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పంజాబ్‌ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ) నుంచి రూ.5 వేల రుణం తీసుకున్నారు. అయితే కొద్దిరోజులకే ఆయన మరణించడంతో... ఆయన చనిపోయిన తర్వాత వచ్చే పెన్సన్‌తో శాస్త్రి సతీమణి లలిత ఆ రుణాన్ని పైసాతో సహా చెల్లించేశారు. దేశంలోని బ్యాంకులను వరుసపెట్టి లూటీ చేస్తున్నా నిద్రవదలని నేటి పాలకులున్న నేటిరోజుల్లో... మరణానంతరం కూడా రుణం తిరిగి చెల్లించిన తీరుపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది.

 

  నీరవ్‌ మోదీ మోసగించిన అదే పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ)కు మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి వంటి నిజాయతీపరులైన ఖాతాదారులుండటం.. రూ. 11,400 కోట్ల బ్యాంకు మోసం దేశాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో పీఎన్‌బీకి సంబంధించిన ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.  నాటి జ్ఞాపకాలను, అప్పటి పరిస్థితులను లాల్‌బహదూర్‌ శాస్త్రి కుమారుడు, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత అనిల్‌ శాస్త్రి వివరించారు.

 

‘‘ మేము సెయింట్‌ కొలంబియా స్కూలుకు ప్రతిరోజూ గుర్రపుబండి (టాంగా)లో వెళ్లేవాళ్లం. ఎప్పుడైనా అధికారిక వాహనం(ఆఫీస్‌ కారు)లో వెళతామంటే నాన్న ఒప్పుకొనేవారు కాదు. వ్యక్తిగత పనులకు ప్రభుత్వ వాహనం వాడరాదన్నది ఆయన నిబద్ధత. దీంతో ఇంట్లో మేమంతా కారు కొందామని పట్టుబట్టగా నాన్న అంగీకరించారు. నాటి ప్రధాని ప్రత్యేక సహాయకుడు వి.ఎస్‌.వెంకట్రామన్‌ వాకబు చేసి.. కొత్త ఫియట్‌ కారు దాదాపు రూ. 12 వేలు ఉంటుందని చెప్పారు. అయితే అప్పటికి మా బ్యాంకు ఖాతాలో రూ. 7 వేలు మాత్రమే ఉన్నాయి. దీంతో మిగతా మొత్తానికి నాన్న బ్యాంకు రుణానికి దరఖాస్తు చేయగా.. అదేరోజు మంజూరైంది. అయితే కొద్ది కాలంలోనే విషాదం.. తాష్కెంట్‌ ఒప్పందంపై సంతకం చేసేందుకు వెళ్లిన నాన్న 1966 జనవరిలో కన్నుమూశారు. అనంతరం మా అమ్మ తనకు వచ్చిన పెన్షన్‌తో బ్యాంకు రుణాన్ని పూర్తిగా చెల్లించారు. ’’  అన్నారు.

అలా నాటి ప్రధాని అప్పుచేసి కొనుక్కున్న లేత పసుపు రంగు(క్రీమ్‌ కలర్‌) ఫియట్‌ కారు (డీఎల్‌ఈ 6) ప్రస్తుతం దిల్లీలోని 1, మోతీలాల్‌నెహ్రూ మార్గ్‌లోని లాల్‌బహదూర్‌ శాస్త్రి మెమోరియల్‌లో ఉంది. 

comments